Back to Explore
Dimki
Details
Year2025Pages125LanguageTeluguFormatPaperbackISBN978-9347114670
Author
PublisherAju Publications
Description
"సమాజంలో చుట్టూ చూసే అనేక సంఘటనల్లో కొన్ని మన మీద బలంగా ముద్ర వేస్తాయి. కొన్ని ఆ రోజు చర్చగా మారి మర్నాటికి మాసిపోతాయి. 'డిమ్కి' కథల్లో ఎన్నుకున్న ప్రతి అంశం మన చుట్టూ ఉన్నవే అయినా వాటిని రచయిత్రి తనదైన కోణంలో చెప్తూ, నిజాన్ని నిష్టూరంగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా మన ముందుంచారు.
ఈ సంపుటిలో మొత్తం తొమ్మిది కథలున్నాయి. మొదటి కథ 'డిమ్కి' బుర్రకథలు చెప్పుకుంటూ జీవనాన్ని సాగించే జంగమయ్యల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన విషాద గాధ. దగాపడ్డ వారి బతుకు చిత్రం... చారడు నూకల కోసం తప్పని పోరాటం... వెరసి సంచార జీవితాలను రికార్డు చేసిన కథ.
కాస్ట్ సిస్టం ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉంటాయని బలంగా, అంతే ఉదాత్తంగా చెప్పిన కథ 'నల్ల చీమలు'. ఊరు వాడల్లో పెద్దలు కులం పేరుతో గుడికి, బడికి దూరం చేసిన వైనం, చదువుకునే కాలేజీల్లో తోటి విద్యార్థులు రిజర్వేషన్ల విషయంలో హేళనగా మాట్లాడుతూ చిన్న చూపు చూడడం షరా మామూలుగా మారింది. అనాదిగా కులం మనిషిని ఎంత కుతంత్రంగా మార్చిందో, అది ఇంకా ఎంతటి కోరలు పెంచిందో ఈ కథ చదివితే అర్థమవుతుంది.
కులవృత్తులను మనసారా కౌగిలించుకున్న కథ 'ముసురు'. తాటి చెట్లు ఎక్కడానికి గౌడన్నలు నిత్యం చేసే బతుకు పోరాట చిత్రం ఈ కథ. కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండే కురుమయ్య కుటుంబంలోని మూడు తరాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ.
మూగజీవి అయిన కుక్క కోణంలో సాగే 'నేను... మీ...!' కథలో కరోనా మానవుల జీవితాల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో, ఆ గడ్డు కాలంలో మనిషితో పాటు మూగ జీవులు కూడా నాలుగు మెతుకుల కోసం, నిలువ నీడ కోసం ఎంతలా విలవిల్లాడిపోయాయో హృద్యంగా దృశ్యమానం చేసి చూపిన కథ. జంతువులను కేవలం మన అవసరాలకు మచ్చిక పేరుతో వాడుకుంటున్నాం. ఆ వాడకం సాటి మనిషిని కూడా నాప్కిన్ మాదిరి వాడుకునేదాకా వచ్చింది. ఈ ధోరణి బద్దలు కొట్టి పునర్వైభవాన్ని పునర్ణిర్మించుకుందామని హృద్యంగా చెప్పిన కథ.
కట్టుకున్నవాడు నిర్దాక్షిణ్యంగా తనను వద్దనుకొని మోసం చేసి వెళ్ళిపోతే, ఒంటరితనం తనను నీడలా వెంటాడుతూ పట్టిపీడిస్తుంటే, ఉన్న చోటే కూలబడిపోయి కన్నీరు కార్చకుండా అధైర్య పడకుండా జయమ్మ తన జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుకుందో, తన వెంటే తిరుగుతున్న ఒంటరితనం అనే నీడను ఎలా వదిలించుకుందో 'చీకటి వెలుగులు' కథలో చూస్తాము.
ఇంట్లో పెద్దవాళ్లు ముఖ్యంగా రైతు కుటుంబాల్లో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు పిల్లల్లో ఎంతగా మానసిక సంఘర్షణకు గురిచేస్తుందో, అది వాళ్ళ మనసుల్లో ఎంత ఫోబియా నింపుతుందో, వాళ్ళ మానసిక స్థితిని ఆ పరిస్థితులు ఎంతగా ప్రభావితం చేస్తాయి అని అంశంగా సాగేదే 'నాయిన చెప్పిన అబద్దం!' కథ.
ఆడపిల్లలకు స్వేచ్ఛ అంటే ఏమిటి? అమ్మాయిలు అదుపులో ఉండాలిగా... ఆడపిల్లలకు బయటి పనులు ఎందుకు? కుటుంబాన్ని చూసుకుంటే చాలదు? అతిగా స్వేచ్ఛ ఇస్తే ఆడపిల్లలు చెడిపోతారు... వంటి మాటలు సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. ఈ తీరు ఎప్పటికీ మారునో. ఇంతటి ఆధునిక యుగంలో కూడా ఇంకా చాలా మటుకు కుటుంబాల్లో ఆడపిల్లలకు తమ చదువుకు, కెరీర్ కి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్వేచ్ఛ లేదు. ఇదే అంశం మీద సాగే కథే 'స్వేచ్చ'.
'ఊరు యాదికొచ్చింది' కథ చదివాక లక్ష్మమ్మ గుండెల మన గుండె కూడా చెరువు అవుతుంది కరోనా మహమ్మారి పేద, మధ్యతరగతి కుటుంబాలని ఎన్ని అరి గోసలు పెట్టిందో ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది. కరోనా మొదలై పనులన్నింటినీ లాక్ చేసేసింది. అప్పుడు ఎంతమంది కూలీలు కాలిబాటన సొంత్తూళ్లకు వెళ్లారో చూసాం. ఆ విషాదం మళ్లీ రావద్దని కోరుకోని హృదయం లేదు. సొంత ఊరు, భూమి వదులుకొని పట్నం వచ్చి బతుకు పోరాటం చేస్తున్న లచ్చుమమ్మ కుటుంబం కోవిడ్ కారణంగా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంది. వేరే ఊర్ల నుంచి పట్నాలకు వలస వచ్చి పనులు చేసుకునే శ్రమజీవుల గాధను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ కథ.
ప్రస్తుత సమాజంలో ఒంటరి స్త్రీల పట్ల కామాంధుల వికృత క్రీడను ప్రశ్నిస్తుంది 'తీర్పు' కథ. ఆత్మరక్షణలో భాగంగా కథానాయక ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని ఈ సమాజం, చట్టాలు ఏకీభవిస్తాయా? తనకి అండగా నిలుస్తాయా? అన్న ప్రశ్నతో కథ తీర్పును పాఠకుల ఆలోచనకే వదిలేస్తూ ముగించిన కథ."
Plot
“డిమ్కి” ఒకే కథను చెప్పే పుస్తకం కాదు; తొమ్మిది విభిన్న కథలతో కూడిన సామాజిక కథా సంకలనం.
“డిమ్కి” కథ సంచార జీవితం సాగించే జంగమయ్యల కుటుంబాల బతుకు పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. “నల్ల చీమలు” కుల వివక్ష, రిజర్వేషన్లపై సమాజంలో ఉన్న చిన్నచూపు మరియు కుల వ్యవస్థ ప్రభావాన్ని ప్రశ్నిస్తుంది. “ముసురు” కులవృత్తిని నమ్ముకుని జీవించే గౌడ కుటుంబం, మూడు తరాల మధ్య ఏర్పడే సంఘర్షణను చూపిస్తుంది.
కరోనా కాలంలో మనుషులతో పాటు మూగజీవులు ఎదుర్కొన్న ఆకలి, ఆశ్రయం మరియు నిర్లక్ష్యాన్ని “నేను... మీ...!” అనే కథ ఒక కుక్క దృష్టికోణంలో చెబుతుంది. “చీకటి వెలుగులు” భర్త చేత మోసపోయిన జయమ్మ తన ఒంటరితనాన్ని అధిగమించి జీవితాన్ని తిరిగి నిర్మించుకునే కథ. కుటుంబంలో పెద్దలు తీసుకునే నిర్ణయాలు పిల్లల మానసిక స్థితిపై చూపే ప్రభావాన్ని “నాయిన చెప్పిన అబద్దం!” ఆవిష్కరిస్తుంది.
“స్వేచ్ఛ” ఆడపిల్లల చదువు, కెరీర్ మరియు వ్యక్తిగత నిర్ణయాల విషయంలో కుటుంబాలు విధించే పరిమితులను ప్రశ్నిస్తుంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వగ్రామానికి తిరిగి వెళ్లాల్సిన వలస కూలీల బాధను “ఊరు యాదికొచ్చింది” కథ చూపిస్తుంది. చివరగా “తీర్పు” ఒంటరి స్త్రీలపై జరిగే లైంగిక వేధింపులు, ఆత్మరక్షణ మరియు సమాజం–చట్టం ముందు నిలిచే నైతిక ప్రశ్నలను పాఠకుడి ఆలోచనకే వదిలేస్తుంది.
మొత్తంగా, “డిమ్కి” సమాజంలోని వాస్తవ జీవితాలను వివిధ కోణాల్లో చూపిస్తూ, కేవలం కథలు చెప్పడం మాత్రమే కాకుండా పాఠకుడిని సామాజిక సమస్యల గురించి ఆలోచింపజేసే కథా సంపుటి.
News & Announcements
“డిమ్కి” కథకు నమస్తే తెలంగాణ–ముల్కనూర్ పబ్లిక్ లైబ్రరీ నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. అలాగే రచయిత్రి స్పూర్తి కందివనానికి 2022లో అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ తరఫున సాహిత్య పురస్కారం లభించింది.
“డిమ్కి” కథకు లభించిన ప్రథమ బహుమతితో పాటు, స్పూర్తి కందివనం రచించిన పలు కథలు ఈనాడు, నమస్తే తెలంగాణ, సారంగ, విశాలాక్షి, విశాలాంధ్ర, సాహితీకిరణం, లోగిలి వంటి ప్రముఖ తెలుగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. “డిమ్కి”, “చీకటి వెలుగులు”, “నాయిన చెప్పిన అబద్ధం” వంటి కథలు పాఠకుల నుంచి ప్రశంసలు పొందాయి. స్పూర్తి కందివనం “కథ 2023” కథా సంకలన కార్యక్రమంలో కూడా రచయితగా పాల్గొన్నారు.
Books Similar to Dimki
Prioritized by same author, then publisher, then overlapping genre












